హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.
ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు , పురాణాలు చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది.
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాల్లో కెల్లా శ్రేష్టమయినది.శంబసాదనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలుకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు. దేవ ఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి శంబసాదనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు. మునులకోరికపై శంబసాదనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.
కాని ఎవరైనా గుర్తుచేస్తే ఆయన శక్తి సామాన్యమైనది కాదు.
No comments:
Post a Comment