దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తున్న సమయంలో...వారికి కవ్వంలా ఉపయోగపడుతున్న మంథరపర్వతం క్షీరసాగరంలో కృంగిపోవడం ప్రారంభించింది. దేవ,దానవులు శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు కూర్మరూపుడై ఆ మంథరపర్వతాన్ని తన వీపున భరించి దేవ,దానవులకు సాయం చేసాడు. అదే ‘శ్రీ ఆదికూర్మావతారం. శ్రీ ఆదికూర్మావతారస్వామికి దేవాలయమన్నది ఒక్క మన ఆంధ్రదేశంలోనే కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని వంశధారా నదీతీరంలోనున్న పుణ్యక్షేత్రమే ‘శ్రీకూర్మం’. శ్రీహరి ఆదికూర్మావతారుడై ఇక్కడ వెలసిన కారణంగా... ఈ క్షేత్రాన్ని ‘శ్రీకూర్మం’ అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో ఉండే స్వామిని ‘శ్రీకూర్మనాథస్వామి’ అని పిలుస్తారు. శ్రీకూర్మక్షేత్రానికి, వంశధారానది పుట్టుకకూ ఎంతో అవినాభావ సంబంధం ఉందని పురాణాలు చెప్తున్నాయి. కృతయుగంలో శ్వేతుడు అనే చక్రవర్తి ఈ భూమిని పాలిస్తూండేవాడు. ఆయన భార్య మహాపతివ్రత, గొప్ప విష్ణుభక్తురాలు. ఒకరోజు మహారాణి ఏకాదశి వ్రతదీక్షలో ఉంది. అది వసంతకాలం. మన్మథుడు తన సార్వభౌమత్త్వాన్ని ప్రకటించుకునే ఋతుకాలం అది. వసంతరాగ సౌరభాలు ... మహారాజు మనసును రాగరంజితం చేసాయి. ఆయనకు భార్యమీద అనురక్తి కలిగింది.
తను ఏకాంతసేవకు వస్తున్నట్లు మహారాణికి కబురు చేసాడు. భర్త కోరిక నెరవేర్చినచో..,వ్రతనియమానికి భంగం కలుగుతుంది. నెరవేర్చకపోతే.., పాతివ్రత్య ధర్మానికి భంగం కలుగుతుంది. మహారాణికి ఏమి చేయాలో తోచలేదు. తను నమ్ముకున్న శ్రీహరిని ధ్యానించింది. శ్రీహరి కరుణించాడు.
వెంటనే మహారాణి భవన సమీపంలోనున్న వెదురుపొదల నుండి ఓ మహాజలప్రవాహం పుట్టుకు వచ్చి, మహారాజ భవనానికి, మహారాణి అంతఃపురానికి మధ్య అడ్డుగా ప్రవహించింది. ఈ సంగతి మంత్రి ద్వారా విన్న మహారాజు..,తన భార్య వ్రతనిష్ఠకు, హరిభక్తికి సంతసించి, తానుకూడా ఈశ్వరానుగ్రహం సంపాదించాలనే సంకల్పంతో చక్రతీర్థంలో తపస్సు రంభించాడు. శివానుగ్రహ ఫలంగా నారదమహర్షి వచ్చి ఆయనకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. అచిరకాలంలోనే శ్వేతచక్రవర్తి తపస్సు ఫలించి శ్రీహరి కూర్మరూపంలో దర్శనమిచ్చాడు. ఆ స్వామియే శ్రీ కూర్మనాధస్వామి. శ్రీ స్వామివారు అక్కడున్న శ్వేతపర్వతంపై కొలువుతీరాలని సంకల్పించి, శ్వేతరాజును, నారదమహర్షిని వెంటబెట్టుకుని శ్వేతపర్వతం ఎక్కడం ప్రారంభించాడు.
కానీ, చిరకాల తపోదీక్షలోనున్న శ్వేతరాజు.. శ్వేతపర్వతం ఎక్కలేకపోవడం శ్రీ స్వామివారు గ్రహించి, తన హుంకారంతో ఆ పర్వతాన్ని భూమికి సమతలం చేసి, అక్కడ అర్చావతారమూర్తిగావెలిసారు. అక్కడ స్వామివారు తన చక్రంతో ఒక జలకుండాన్ని ఏర్పరచారు. దానినే ‘చక్రకుడం, శ్వేతపుష్కరిణి, సుధాకుండం’ అని పిలుస్తారు. ఈ చక్రతీర్థం నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించి శ్రీ స్వామివారిని చేరిందని కూడా అంటారు. మహారాణి పాతివ్రత్య నియమాన్ని కాపాడడం కోసం రాజమందిరానికి, అంతపురానికి మధ్య ప్రవహించిన జలధారే ‘వంశధారానది. ఆ సమీపారణ్యాలను పాలించే భిల్లరాజు భక్తికి సంతసించిన శ్రీ స్వామివారు అతనికి పశ్చిమాభిముఖుడై దర్శనమిచ్చాడు. ఆ భిల్లరాజే పుష్కరిణికి మెట్లు కట్టించాడు. శ్వేతరాజు ఆలయాన్ని నిర్మించాడు. వక్రాంగముని, దూర్వాసుడు, బలరాముడు ఈ స్వామిని సేవించి తరించారని చెప్తారు. శ్రీ రామానుజాచార్యులు ఈ తీర్థాన్ని విష్ణుతీర్థంగా మార్చడంతో ఇక్కడ మనకు గోవిందరాజస్వామి, చక్రనారాయణస్వామి, బలినారాయణస్వామి, నరనారాయణస్వామి దేవాలయాలు కనిపిస్తాయి. పుష్కరిణి గట్టునున్న శ్వేతమృత్తికను వైష్ణువులు తిరునామంగా ధరిస్తారు. అమృతోద్భవానికి శ్రీ స్వామివారు సహకరించిన కారణంగా, శ్రీ స్వామివారి ప్రసాదాన్ని అమృతమయంగా, సర్వరోగనివారిణిగా భావించి భక్తులు స్వీకరిస్తారు. జ్యేష్ఠ బహుళ ద్వాదశినాడు శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి
No comments:
Post a Comment